సాంకేతికత గురువుకు ప్రత్యామ్నాయం కాదు
సాంకేతికత సమాచారాన్ని అందించగలదు…
కానీ మనిషిని తీర్చిదిద్దలేదు! కాలం మారుతోంది. విద్యా ప్రపంచం శరవేగంగా మారుతోంది. ఒకప్పుడు నల్లబల్ల, సుద్దముక్క, పాఠ్యపుస్తకం చుట్టూ తిరిగిన తరగతి గది.. నేడు డిజిటల్ బోర్డులు, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, ఇంటర్నెట్, ఆన్‌లైన్ వనరులు, కృత్రిమ మేధస్సు వంటి ఆధునిక సాంకేతికతతో కొత్త రూపాన్ని సంతరించుకుంది.
విద్యార్థి చేతిలో ఇప్పుడు ప్రపంచమే ఉంది. ఒక మొబైల్ ఫోన్‌తో ప్రపంచంలోని ఏ మూలలో ఉన్న సమాచారాన్నైనా క్షణాల్లో తెలుసుకోవచ్చు. వీడియోల ద్వారా నేర్చుకోవచ్చు. ఆన్‌లైన్ తరగతులకు హాజరుకావచ్చు. కృత్రిమ మేధస్సును ఉపయోగించి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు.
ఇంతటి సాంకేతిక విప్లవం జరుగుతున్న సమయంలో సహజంగానే ఒక ప్రశ్న ఎదురవుతోంది. ఇక గురువు అవసరం ఏమిటి? సాంకేతికత అన్నీ చేయగలిగినప్పుడు గురువు పాత్ర తగ్గిపోతుందా? సమాధానం ఒక్కటే సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా.. అది గురువుకు ప్రత్యామ్నాయం కాదు. ఎందుకంటే సాంకేతికత సమాచారాన్ని అందించగలదు. గురువు మాత్రం ఆ సమాచారాన్ని జ్ఞానంగా, జ్ఞానాన్ని వివేకంగా మార్చే శక్తిని విద్యార్థిలో పెంచుతాడు. సమాచారం ఉంది.. కానీ వివేకం ఉందా? నేటి విద్యార్థి చేతిలో అపారమైన సమాచారం ఉంది. గత తరాల విద్యార్థులకు అందని స్థాయిలో జ్ఞాన వనరులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఒక్క క్లిక్‌తో సమాధానాలు లభిస్తున్నాయి. కానీ ఇక్కడే అసలు సవాలు మొదలవుతుంది. సమాచారం వేరు.. జ్ఞానం వేరు.. వివేకం వేరు.
ఇంటర్నెట్ ‘ఏమిటి?’ అని చెప్పగలదు. కానీ ‘ఎందుకు?’ అని ప్రశ్నించేలా చేయడం గురువు బాధ్యత.
సాంకేతికత ఒక విషయాన్ని చూపించగలదు. కానీ దాన్ని ఎలా ఉపయోగించాలో నేర్పేది గురువు. AI ఒక సమాధానం ఇవ్వగలదు. కానీ ఆ సమాధానం సరైనదేనా? దాని వెనుక ఉన్న వాస్తవం ఏమిటి? దాన్ని ఏ సందర్భంలో ఉపయోగించాలి? దాని వల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయి? అనే ప్రశ్నలను ఆలోచింపజేసేది గురువు. అందుకే AI ఎంత తెలివైనదైనా, అది ఆలోచింపజేసే గురువుకు ప్రత్యామ్నాయం కాలేదు. యంత్రం సమాధానం ఇస్తుంది.. గురువు దిశ చూపుతాడు ఒక విద్యార్థి ప్రశ్న అడిగితే యంత్రం సమాధానం ఇవ్వగలదు. కానీ ఆ ప్రశ్న ఎందుకు వచ్చింది? విద్యార్థి మనసులో ఏ సందేహం ఉంది? అతని ఆలోచనా విధానం ఎలా ఉంది? అతనికి ఏ అంశంలో ఇబ్బంది ఎదురవుతోంది? అనే విషయాలను యంత్రం ఎంతవరకు అర్థం చేసుకోగలదు? గురువు మాత్రమే విద్యార్థిని ఒక వ్యక్తిగా చూస్తాడు. అతని ప్రశ్న వెనుక ఉన్న ఆలోచనను గమనిస్తాడు. అతని బలహీనతను గుర్తిస్తాడు. అతని ప్రతిభను వెలికితీస్తాడు. తప్పు చేసినప్పుడు సరిదిద్దుతాడు. నిరాశ చెందినప్పుడు ప్రోత్సహిస్తాడు. ప్రతి విద్యార్థి ఒకేలా ఉండడు తరగతి గదిలో ఉన్న ప్రతి విద్యార్థి ఒకే రకమైనవాడు కాదు. ఒక విద్యార్థి చురుకుగా ఉండవచ్చు. మరొకరు నిశ్శబ్దంగా ఉండవచ్చు. ఒకరు వెంటనే పాఠాన్ని అర్థం చేసుకోవచ్చు. మరొకరికి అదే విషయం అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. విద్యార్థి వెనుకబడటానికి కారణం అతని సామర్థ్యం లేకపోవడమేనని అనుకోవడం సరైంది కాదు. కుటుంబ పరిస్థితులు కావచ్చు. ఆర్థిక సమస్యలు కావచ్చు. ఆత్మవిశ్వాసం లేకపోవచ్చు. భయం కావచ్చు. లేదా తనను నమ్మే ఒక మనిషి కోసం అతను ఎదురు చూస్తూ ఉండవచ్చు. ఈ పరిస్థితులను ఒక డిజిటల్ పరికరం గుర్తించకపోవచ్చు. గురువు మాత్రం గుర్తించగలడు. విద్యార్థి కళ్లలోని నిశ్శబ్దాన్ని చదవగలడు. అతని సమస్యను అర్థం చేసుకోగలడు. అవసరమైన సమయంలో భుజంపై చేయి వేసి ‘నువ్వు చేయగలవు.. నేను నిన్ను నమ్ముతున్నాను’ అని చెప్పగలడు. ఈ మాటలో ఉన్న మానవీయ స్పర్శను ఏ సాంకేతికతా భర్తీ చేయలేదు. మార్కులు ఇవ్వగలదు.. విలువలు నేర్పగలదా?
విద్యార్థికి మంచి మార్కులు రావాలి. మంచి ర్యాంకు సాధించాలి. ఉన్నత విద్య అభ్యసించాలి. మంచి ఉద్యోగం పొందాలి. ఇవన్నీ విద్యలో ముఖ్యమైన లక్ష్యాలే. కానీ విద్య లక్ష్యం ఇంతటితో ముగియకూడదు. ఒక విద్యార్థి ఎంత మార్కులు సాధించాడు అన్నది ఒక కొలమానం. కానీ అతను ఎంత మంచి మనిషిగా ఎదిగాడు అన్నది అంతకంటే గొప్ప ప్రశ్న. తల్లిదండ్రులను గౌరవించడం, సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండటం, బలహీనులకు అండగా నిలవడం, నిజాయితీగా జీవించడం, ఇతరుల బాధను అర్థం చేసుకోవడం వంటి మానవీయ విలువలను విద్యార్థిలో పెంచడం విద్య యొక్క అసలైన లక్ష్యం.
ఇవి కేవలం సమాచారంతో నేర్చుకోలేం. విలువలను పుస్తకంలో చదవొచ్చు.. కానీ వాటిని జీవితంలో ఆచరించడం నేర్పేది గురువు. గురువు బోధించడమే కాదు.. మనిషిని తీర్చిదిద్దుతాడు
నాటి గురువు కేవలం పాఠ్యపుస్తకంలోని పాఠాన్ని మాత్రమే బోధించేవాడు కాదు. క్రమశిక్షణ, నిజాయితీ, సమయపాలన, బాధ్యత, పెద్దల పట్ల గౌరవం, దేశభక్తి, మానవత్వం వంటి విలువలను విద్యార్థుల్లో నాటేవాడు. గురువు మందలింపులో కోపం కంటే ప్రేమ ఉండేది. కఠినంగా కనిపించే మాటల వెనుక విద్యార్థి భవిష్యత్తుపై ఆందోళన ఉండేది. అప్పట్లో అర్థం కాని ఆ మాటల విలువ సంవత్సరాలు గడిచిన తర్వాత తెలుస్తుంది. అందుకే ఒక మంచి గురువు ఒక పాఠాన్ని మాత్రమే బోధించడు. ఒక జీవితానికి మార్గదర్శకత్వం వహిస్తాడు. సాంకేతికతను తిరస్కరించాల్సిన అవసరం లేదు, అయితే సాంకేతికతను వ్యతిరేకించడం కూడా సరైన దృక్పథం కాదు. డిజిటల్ సాధనాలు, ఇంటర్నెట్, ఆన్‌లైన్ తరగతులు, AI వంటి సాంకేతికతలు విద్యను మరింత విస్తృతం చేశాయి. ఒక గురువు చేతిలో ఇవి శక్తివంతమైన సాధనాలుగా మారగలవు. అందువల్ల ప్రశ్న.. ‘సాంకేతికతా? గురువా?’ అని ఉండకూడదు. ‘సాంకేతికతను గురువు ఎలా సమర్థంగా ఉపయోగించాలి?’ అన్నదే అసలు ప్రశ్న.
సాంకేతికత గురువు స్థానాన్ని తీసుకోవడం కాదు. గురువు సామర్థ్యాన్ని పెంచాలి. AI సమాధానాలు ఇవ్వాలి. గురువు ఆ సమాధానాలపై విద్యార్థిని ఆలోచింపజేయాలి. ఇంటర్నెట్ సమాచారాన్ని అందించాలి. గురువు ఆ సమాచారాన్ని విశ్లేషించడం నేర్పాలి. డిజిటల్ సాధనాలు పాఠాన్ని సులభతరం చేయాలి. గురువు దాన్ని జీవితానికి అన్వయించడం నేర్పాలి. అప్పుడు మాత్రమే సాంకేతికత విద్యకు నిజమైన మిత్రుడవుతుంది. గురువు కూడా నేర్చుకుంటూనే ఉండాలి
మారుతున్న కాలంలో గురువు పాత్ర కూడా మారాలి. కొత్త సాంకేతికతను తెలుసుకోవాలి. AIని అర్థం చేసుకోవాలి. కొత్త బోధనా పద్ధతులను నేర్చుకోవాలి. ఎందుకంటే నిజమైన గురువు తన విద్యార్థుల నుంచీ కూడా నేర్చుకుంటాడు. విద్యార్థుల ప్రశ్నలు గురువును మరింతగా ఆలోచింపజేస్తాయి. వారి కొత్త ఆలోచనలు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. వారి విజయాలు గురువుకు ఆనందాన్ని ఇస్తాయి. వారి అపజయాలు మరింత బాధ్యతను గుర్తుచేస్తాయి. అందుకే గురువు–విద్యార్థి సంబంధం కేవలం జ్ఞాన బదిలీ కాదు. అది పరస్పర అభ్యసన ప్రయాణం. గురువు జ్ఞాపకం.. జీవితాంతం విద్యార్థి పాఠశాల గడప దాటిన రోజుతో గురు–శిష్య బంధం ముగియదు. సంవత్సరాలు గడిచినా, జీవితంలో ఎన్నో మలుపులు వచ్చినా, ఒక మంచి గురువు జ్ఞాపకం మనసులో నిలిచిపోతుంది. ఎందుకంటే గురువు మనకు ఒక పాఠాన్ని మాత్రమే నేర్పడు. మనల్ని మనం నమ్ముకోవడం నేర్పుతాడు. ఏళ్ల తర్వాత ఒక విద్యార్థి తన గురువును కలిసి, ‘సార్.. మీరు అప్పట్లో చెప్పిన మాట నాకు ఇప్పటికీ గుర్తుంది’ అని చెప్పడం గురువుకు లభించే అత్యున్నత గౌరవం.
గురువుకు గొప్ప అవార్డు ఏదైనా ఉంటే అది ఇదే తన విద్యార్థి మంచి మనిషిగా ఎదగడం. ఉపాధ్యాయ దినోత్సవం మనకు చెప్పే సందేశం.. సెప్టెంబర్ 5న జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవం కేవలం సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని స్మరించుకునే రోజు మాత్రమే కాదు. గురువు విలువను గుర్తుచేసుకునే రోజు. విద్య యొక్క అసలైన లక్ష్యాన్ని మననం చేసుకునే రోజు. పూలమాలలు వేయడం, శుభాకాంక్షలు చెప్పడం, సన్మానాలు చేయడం మాత్రమే ఉపాధ్యాయ దినోత్సవం కాదు. ‘మన విద్యార్థుల కోసం మనం ఇంకా ఏమి చేయగలం?’ అని ప్రతి గురువు తనను తాను ప్రశ్నించుకోవాలి. అదే ఈ దినోత్సవానికి నిజమైన అర్థం.
ముగింపు :
రేపటి విద్యా ప్రపంచం మరింత సాంకేతికంగా మారవచ్చు. మనిషి అడిగే ప్రతి ప్రశ్నకు AI సమాధానం ఇవ్వవచ్చు. వర్చువల్ తరగతులు మరింత విస్తరించవచ్చు. పుస్తకాలు డిజిటల్ రూపం దాల్చవచ్చు. కానీ విద్యార్థి జీవితంలో ఒక సమయంలో అతనికి సమాచారం కంటే నమ్మకం అవసరం అవుతుంది. జ్ఞానం కంటే వివేకం అవసరం అవుతుంది. సమాధానం కంటే దిశ అవసరం అవుతుంది. విజయం కంటే విలువలు అవసరం అవుతాయి. అప్పుడు అతని పక్కన నిలబడేది సాంకేతికత కాదు గురువు మాత్రమే. సాంకేతికత ‘ఏమి తెలుసుకోవాలి?’ అని చెప్పవచ్చు.
గురువు ‘ఎలా ఆలోచించాలి?’ అని నేర్పుతాడు.
సాంకేతికత సమాధానం ఇవ్వవచ్చు. గురువు సరైన ప్రశ్న అడగడం నేర్పుతాడు. సాంకేతికత సమాచారాన్ని అందించవచ్చు. గురువు ఆ సమాచారానికి అర్థాన్ని చూపుతాడు.
అందుకే… సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా గురువుకు ప్రత్యామ్నాయం కాదు. గురువు చేతిలోని సాధనాలు మారాయి.. కానీ విద్యార్థి భవిష్యత్తుపై ఆయన బాధ్యత మారలేదు. కాలం మారింది… తరగతి గది మారింది… సాంకేతికత మారింది… కానీ గురువు అవసరం మాత్రం ఎప్పటికీ మారదు. అందుకే ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రతి గురువుకూ వందనం.🙏
చల్లగాని కృపాబాలానందం
ప్రధానోపాధ్యాయులు, GHS శాంతినగర్, ఖమ్మం
(NCERT సర్టిఫైడ్ సామాజిక శాస్త్రాల పాఠ్యపుస్తక రచయిత.)
Comments
Post a Comment