మిత్రులందరికీ 78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో...
మిత్రులందరికీ భారత 78వ స్వాతంత్ర్య
దినోత్సవ శుభాకాంక్షలు. మనదేశ ప్రజలంతా 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా ఇలా మీ ముందు కొన్ని విషయాలను పంచుకోవడం నాకు ఎనలేని ఆనందంగా ఉంది. ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు దారితీసిన అసంఖ్యాక త్యాగాలను, పోరాటాలను మనం గుర్తించి గౌరవించాలి. ఎన్నో
వైవిద్యతలు గల దేశ
ప్రజలను ఒక తాటిపైకి తీసుకువచ్చి “ భిన్నత్వంలో ఏకత్వం” గల దేశంగా మార్చే క్రమంలో అమరులైన
మహనీయులను, వారు పాటించిన ఆదర్శవంతమైన విలువలను, వారు
నమ్మిన ఆశయాలను గౌరవిస్తూ, దేశ స్వాతంత్ర్య సాధన కోసం వారు
చేసిన త్యాగాలను, వారి పోరాట స్పూర్తిని, వారి నిబద్ధతను మననం చేసుకోవాల్సిన శుభదినం ఈరోజు.
సాంఘికశాస్త్ర ఉపాధ్యాయునిగా, మంచి భవిష్యత్తును నిర్మించుకోవడానికి మన గత చరిత్రను అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను నేను తరగతి గదిలో పాఠ్యాంశాల రూపంలో గుర్తు చేస్తూనే ఉంటాను. మన దేశానికి స్వాతంత్ర్యం అంత తేలికగా సాధించబడలేదు. వ్యాపారం పేరుతో మన దేశానికి వచ్చి, మన దేశ పాలకులలో ఉన్న అనైక్యతను ఆసరా చేసుకుని దేశాన్ని తమ పాదాక్రాంతం చేసుకొని దాదాపుగా రెండు శతాబ్ధాల పాటు ఈ దేశాన్ని పాలించిన “రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాని”కి వ్యతిరేకంగా పోరాడి తెచ్చుకున్న స్వాతంత్ర్యం ఇది. ఈ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని అశువులు బాసిన అమర వీరులందరినీ, మహనీయులందరినీ పేరుపేరునా గుర్తు చేసుకోవలసిన సమయం ఇది. ప్రథమ స్వాతంత్ర్య సమర యోధులైన ఝాన్సీ లక్ష్మీబాయి, నానాసాహెబ్, తాంతియాతోపే తో మొదలుకొని, భారత జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యావంతులలో చైతన్యం నింపి, తమ ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన మితవాద నాయకులైన W.C. బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే, దాదాభాయి నౌరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ, ఉమేష్ షా మెహతా, బద్రుద్దీన్ త్యాబ్జీ మొ.గు వారిని, హిందూ ముస్లింల మధ్య విభజించు పాలించు విధానంతో చేసిన బెంగాల్ విభజనకు నిరసనగా విదేశీ వస్తు బహిష్కరణ స్వదేశీ వస్తువుల వాడకం అనే నినాదంతో విద్యార్థులు, యువకులలోఅణువణువూ దేశభక్తి రగిలించి స్వాతంత్రోద్యమ బాట పట్టించిన “లాల్- బాల్- పాల్, అరవింద్ ఘోష్ లాంటి మహనీయులను ”, “స్వరాజ్యం నా జన్మహక్కు అది సాధించి తీరుతాను” అని ఉక్కు సంకల్పంతో దిక్కులు పిక్కటిల్లేలా నినదించిన బాలగంగాధర్ తిలక్ గారి ఉద్యమ మార్గదర్శనాన్ని, ఇంక్విలాబ్ జిందాబాద్ అని గర్జించి బ్రిటీష్ పార్లమెంట్ పై తిరుగుబాటు చేసిన, ఉడుకురక్తంతో ఉరకలెత్తిన భగత్ సింగ్ ను, అటవీ ప్రాంతాలపై ఆధిపత్యధోరణికి వ్యతిరేకంగా గళమెత్తిన అల్లూరి సీతారామరాజు ధైర్య సాహసాలను, దమ్ముంటే నన్ను కాల్చండిరా అని తుపాకీ తూటాకు ఎదురుగా గుండె నిలిపిన ఆంద్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారిని, సత్యం అహింసతో కూడిన, సత్యాగ్రహం పేరుతో యావత్ భారతావనిని ఒక్కటిగా చేసిన మహాత్మా గాంధీ గారిని, “అజాద్ హింద్ ఫౌజ్” పేరుతో దేశ స్వాతంత్ర్యం కోసం కదనరంగంలో దూకిన సుభాష్ చంద్రబోస్ ను, దళితులు, గిరిజనులు సామాజిక వెనుకబాటుకు గురయ్యి సమాజానికి దూరంగా ఉన్న ప్రజలను భారతీయ సమాజంలోమమేకం చేయడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన డా. బి.ఆర్ అంబేద్కర్ గారిని, స్వాతంత్ర్య పోరాటంలో గాందీజీ మార్గంలో నడిచి ప్రథమ ప్రధానిగా ఈ దేశానికి దిశ దశను నిర్ణయించి, పంచవర్ష ప్రణాళికలు, అలీన విధానం, పంచశీల సిద్దాంతం రూపొందించిన పండిట్ జవహర్‌లాల్ నెహ్రూను, “జై జవాన్ జై కిసాన్” అని ప్రకటించిన లాల్ బహదూర్ శాస్త్రిని, 550 స్వదేశీ సంస్థానాల విలీనం చేసి ఉక్కుమనిషిలా నిలబడిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ గారిని, గానకోకిలగా ప్రసిద్ది చెందిన సరోజినీ నాయుడు మొదలగు వారి త్యాగాలను మననం చేసుకోవాల్సిన సమయం ఇది.
భారతీయ సమాజ ఐక్యతకోసం వందేమాతరం అనే గేయంతో దేశ ప్రజలను ఏకం చేసిన బంకించంద్ర చటర్జీ మరియు ‘విభిన్న ప్రాంతాలుగా ఉన్నా మనమంతా ఒకటే' అనే విధంగా “పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా, ద్రవిఢ, ఉత్కల, వంగ, వింధ్య, హిమాచల, యమునా, గంగ ...అంటూ విశాల భారత ఐకమత్యాన్ని చాటి చెప్పేలా జాతీయ గీతాన్ని పలికించిన రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటివారి రచనలను, దళితులు, గిరిజన, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు,మహిళల హక్కులకై పోరాడి వారిలో చైతన్యాన్ని పెంపొందించి సమాజంలో భాగంగా మార్చేక్రమంలో తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయులైన మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రి భాయి పూలే, రాజా రామ్ మోహన్ రాయ్, దయానంద సరస్వతి, ఈశ్వర చంద్ర విద్యాసాగర్, కందుకూరి వీరేశలింగం పంతులు, బి. ఆర్ అంబేద్కర్ మొదలగు వారి ఆశయాలు, మరియు వారి అవిశ్రాంత కృషి ఫలితమే మనం నేడు అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్యం.
మహనీయుల జీవిత కథలు మన పాఠ్య పుస్తకాలలోని అధ్యాయాలు మాత్రమే కాదు; అవి వారు చూపిన ధైర్య సాహసాలకు ప్రతిరూపాలు, దేశ ప్రజలను ఐక్యతగా చేయుటకు వారు చూపిన మార్గదర్శనానికి నిదర్శనాలు, వారంతా సామూహికంగా కన్న కలల సారాంశాలు, వారి ఆశయ శక్తికి, యుక్తికి, కృషికి సంబంధించిన పాఠాలు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్య ఫలాలు. స్వాతంత్ర్య దినోత్సవం అంటే కేవలం మహనీయులకు దండవేసి దండం పెట్టడం, మువ్వన్నెల జెండా ఎగురవేయడం, మిఠాయిలు పంచుకోవడం, నాలుగు మాటలు పంచుకోవడం తోటే మన బాధ్యత తీరినట్లుగా భావించవద్దు.
ఈ రోజు మనం మన స్వాతంత్ర్య వేడుకలను జరుపు కుంటునప్పుడు కేవలం మన హక్కులను మాత్రమే కాకుండా దానితో పాటు మనం నెరవేర్చాల్సిన బాధ్యతల గురించి కూడా ఆలోచించుదాం. “స్వేచ్ఛ” అంటే పరాయి పాలన లేకపోవడమే కాదు; ఇది అందరికీ న్యాయం, సమానత్వం మరియు గౌరవాన్ని అందించడం. మన రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టడం, ప్రతి వ్యక్తి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న సమాజం కోసం పనిచేయడం.
ప్రస్తుతం మన చుట్టూ ఉన్న పరిసరాలను చూస్తున్నప్పుడు, సైన్స్, టెక్నాలజీ, విద్య, వైద్యం మరియు సామాజిక సంస్కరణలు వంటి వివిధ రంగాలలో అద్భుతమైన పురోగతిని సాధించిన దేశం మనకు కనిపిస్తుంది. నిజమే మనదేశం నేక రంగాలలో ఈ 77 సంవత్సరాల కాలంలో గణనీయమైన పురోగతి సాధించింది అంతరిక్షం, చంద్రమండలంకు కూడా ఖచ్చితమైన లక్ష్యం తో చేరుకోగలిగే సామర్ధ్యం సాధించాము. సాధించిన ప్రగతిని చూసి తప్పక గర్వపడాల్సిందే కానీ, ఆ అభివృద్ది ఫలాలు కొందరికే దక్కుతున్నాయి. నాణానికి ఒకవైపు అభివృద్ది మరోవైపు వెనుకబాటుతనం అన్నట్లుగా మనం అనేక రంగాలలో ప్రత్యేక దృష్టి పెట్టవలసిన సవాళ్ళను నిరంతరం ఎదుర్కొంటూనే ఉన్నాము —పేదరికం, నిరుద్యోగం, సామాజిక- ఆర్దిక అసమానతలు, ఎన్నికలలో అనుచిత ప్రవర్తనలు, లంచగొండితనం, అసమాన న్యాయం మరియు పర్యావరణ సమస్యలు మొదలగు వాటిని మనం అనుభవిస్తున్నాము.
మనదేశ అభివృద్ధి “గాజుతెర ఆర్ధిక వ్యవస్థ” గా మిగిలిపోతుంది. దేశంలో ఒకవైపు రెక్కాడినా డొక్కాడని (సరియైన ఆహారం అందక ఆకలితో అలమటించే) వారు లక్షల్లో ఉన్నారు. ఒక్కపూట విందు వినోదాలకోసం లక్షల - కోట్ల రూపాయలను ఖర్చు చేసేవారు ఉన్నారు. నిరుద్యోగం, చిరుద్యోగం, ప్రచ్చన్న నిరుద్యోగాలతో బ్రతుకు బండిలాగించే కుటుంబాలు ఒకవైపు, కాలు కదపకుండా కోట్ల సంపద పోగేసుకొనేవారు ఒకవైపు, సమాజ సంపద అంతా కేంద్రీకృతమై దేశంలొని 1% ధనవంతుల దగ్గర 40% ఆదాయం పోగుబడిపోయి అసమానసమాజం అందవిహీనమై వెక్కిరిస్తుంది. నర్సరీ, LKG మొదలుకొని వైద్య ఇంజనీరింగ్ విద్యను లక్షలు కోట్లు పెట్టుబడిగా పెట్టి చదువుకొంటున్న సమాజం ఒకవైపు ఉంటే, ప్రభుత్వం అనేక ఉచిత సౌకర్యాలు కల్పించి ఉచితంగా విద్యను అందిస్తుంటే కూడా చదువుకోలేని స్థితిలో మనం ఒకవైపు ఉంటున్నాము.
భావిభారత సమాజాన్ని తరగతి గదులలో నిర్మించే ఉపాధ్యాయులుగా, సమాజం పట్ల జ్ఞానం, అవగాహన ఉన్నవారిగా సామాజిక పోకడలను గమనిస్తూన్న వారిగా, మనం బాధ్యతతో ఈ సవాళ్లను ఎదుర్కొనేలా తదుపరి తరాన్ని శక్తివంతం చేయడం మన కర్తవ్యం. ప్రియమైన విద్యార్థులారా ఒక్కసారి ఆలోచించండి..., మీరు ఈ దేశానికి గొప్ప భవిష్యత్తు. నేటి బాలలే రేపటి పౌరులు. మీరు ఎంచుకునే మంచిమార్గాలు, మీరు పాటించే విలువలు, మీ క్రమశిక్షణ, నీతి, నిజాయితీ, మీ నేటి సక్రమ చర్యలు రేపటి భారతదేశానికి ఒక అందమైన రూపాన్ని ఇస్తాయి. ఈ ప్రపంచంలో మన దేశ భవితను, స్థానాన్ని నిర్ణయిస్తాయి. మనం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు, సమాజ అభివృద్ధికి తోడ్పడే బాధ్యతతోనే నిజమైన స్వేచ్ఛ వస్తుందని గుర్తుంచుకోండి. స్వేచ్ఛగా మాత్రమే కాకుండా, న్యాయంగా, సమానత్వంతో, నిబద్దతతో కూడిన దేశాన్ని నిర్మించడానికి మనం అందరం కలిసి పని చేద్దాం.
భారతదేశాన్ని శాంతి, శ్రేయస్సు, పురోగతికి వేదికగా మార్చడానికి కృషి చేసే చురుకైన, బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండటం ద్వారా మన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గౌరవిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. భారత స్వాతంత్య్రోద్యమ ఫలాలను, దేశభక్తితో, అంకితభావంతో మరింత ధృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్దాం. విశ్వయవనికపై జాతీయ పతాకాన్ని రెపరెపలాడిద్దాం... జై హింద్
చల్లగాని కృపాబాలానందం
సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులు.
Comments
Post a Comment