ఉత్తరానికో ఉత్తరం
ప్రపంచ
తపాలా దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 9న జరుగుతుంది... స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో 1874లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (UPU) స్థాపించబడింది. UPU వార్షికోత్సవం సందర్భంగా ప్రపంచ తపాలా దినోత్సవం జరుపు కుంటారు...
ఈ సందర్భంగా... తపాలా అంటే గుర్తుకు వచ్చే ఉత్తరానికో ఉత్తరం...
పూజ్యులైన ఉత్తరం గారికి నమస్కారములతో,
ఉభయకుశలోపరి....
ఇంతకూ, ఉత్తరమా.. ఉత్తరమా... నీ ఆచూకీ ఎక్కడమ్మా? ఉత్తరం అనే మూడక్షరాలు
నేడు కళ తప్పిపోయాయి కావచ్చు. మన్నించు నేస్తమా .. నీ గొప్ప తనాన్ని తగ్గించి
తప్పుచేసింది మేమేకదా... ఆధునిక యాంత్రిక యుగంలో ప్రవేశించి నీ ఆనవాళ్ళను చిదిమేశాము. ఎన్ని సంవత్సరాలుగా నీతో
అనుబంధం పెంచుకున్నాం. నీతో ఎన్ని మధుర ఙ్ఞాపకాలను పంచుకున్నాం. ఆ ఙ్ఞాపకాలను
ఇరవై ఒకటవ శతాబ్దంలో పూర్తిగా అటకెక్కించాం. ఊహ తెలిసిన కొత్తలో మూడవ తరగతిలో అనుకుంటా లేఖలు రాయడంలో ఓనమాలు దిద్దుకున్నాం. తరగతులు పెరిగిన కొలది నిన్ను మెప్పించుటకు గాను నైపుణ్యతలో మెరుగులు దిద్దుకున్నాం. పై చదువులకు ఇంటికి దూరమైన కొలది నిన్ను మరింత దగ్గరగా చేసుకొని మాలో కవితాత్మక
ధోరణి అలవరచుకున్నాం. యువకులుగా మారాకా హృదయాలను కొల్లగొట్టేలా
రాయడంలో పరిణతి సాధించాం. “మావాడు లేఖలు భలేగా రాస్తాడు తెలుసా!”
అని నలుగురికి మా వాళ్ళు చెప్పుకొనే మాటలు వినసొంపుగా అనిపించి సగర్వంగా
ఫీలయ్యాము. వీధి
చివర పోస్టు డబ్బాలో ఉత్తరం రాసి వేస్తే అయినవారికి
చేరుస్తుందని, తోకలేని పిట్ట తొంభై మైళ్ళ దూరం వెళుతుందని
నీ గురించి కథలు కథలుగా పొడుపు కథలుగా చెప్పుకున్నాం. ఇదేంటబ్బా అదెలా సాధ్యం
అనేదొక జిజ్ఞాస మా చిట్టి మనసులకు
అప్పట్లో అదొక పరీక్ష, ఇంటికి పోస్ట్ మాన్ వస్తున్నాడంటే
నిన్ను అందిస్తున్నాడంటే అమ్మానాన్నలకు కొడుకు కూతురు క్షేమ సమాచారాల కబురు కాకితో పంపినంత సంబరం... పిల్లలు సెలవులకు అమ్మమ్మ నాన్నమ్మలతో కలిసి పంచుకొన్న కల్పిత కథల అనుభూతుల సరదా కాలక్షేపం, యవ్వనంలో యువతీ యువకులకు తమ మనసు
దోచిన వారినుండి హృదయాన్ని
కొల్లగొట్టే మనసును రంజింపజేసే జాబు వస్తుందని గుప్పెడంత ఆశ. నిరుద్యోగులకు ఉద్యోగ సమాచారం మోసుకొస్తుందనే
కొండంత ఆరాటం. అందరికీ “నీ” రాక.. ఒక ఆత్మీయ
బంధువు వచ్చినంత
సంబరం… నిన్ను అందుకుని ఆశగా, ఆబగా అమ్మకో నాన్నకో ఇచ్చాక, వారు చదివి వినిపించమంటే
లేఖకొసన చింపుతుంటేనే ఆతృత.. కళ్ళలో మెరుపులు... అదొక అద్భుతమైన భావన… మనసుకు
హాయిని కలిగించే మధురానుభూతి. నాడు
నిన్ను చదువుతున్నప్పుడు హృదయావిష్కరణ జరిగేది. అన్ననో, తమ్ముడో, అక్కో, చెల్లెలో లేక మనసు దోచిన ప్రియురాలో
మన ఎదుట నిలిచి మాట్లాడుతున్న అనుభూతి మాటలతో కవ్విస్తున్న భ్రాంతి... ప్రియురాలు మళ్ళీ మళ్ళీ చదువుకొనే ముత్యాల పొగడ్తల ప్రేమలేఖ, భార్యాభర్తల విరహంలో ఉండే మాధుర్యం... భామ్మ
- తాతలకు ఓదార్పునిచ్చే బిడ్డల చిరు క్షేమ సమాచారం...వారి క్షేమం అక్షరాలలో చూసుకొని ఆప్యాయంగా కళ్ళలో కనిపించే కన్నీటి పొర మనసుతో మాటాడుతున్న మధురానుభూతి... ఒక్కటేమిటి లెక్కకు మించిన అనుభూతులు ఎన్నో ఎన్నెన్నో... అమ్మ చేతి లేఖలో అమ్మమ్మ సలహాలు...నాన్న చదివే
లేఖలో బాబాయ్ కనిపిస్తారేమోనని
భ్రమ...భామ్మ చదివే లేఖలో మనుమడి మురిపాలు, గుండెగొంతులో కొట్లాడటం మనసు ఆర్తితో ద్రవించడం అంటే ఏమిటో కనిపించేది అక్షరాలు ఆనందంతో నర్తించడం ...పదాలు పదనిసలు పలకడం, వాక్యాల అల్లిక పూలదండలా అందంగా మార్చడంలో మాధుర్యం మాటలు పెదాలనుండి కాకుండా గుండెలనుండి వాక్య రూపం సంతరించుకోవడం. మనసుకు మనోహర దృశ్యరూపం ఆవిష్కరించడం జరిగేది...
ఉత్తరమా.. నీవు ఎన్ని
చిత్రాలు చేశావు! మా మానవజాతి అనుభవాలను అనుభూతులను తరతరాలుగా అందించావు. మనసులను బంధించే మధుర ఙ్ఞాపకాలను మిగిల్చావు. మాకు దూరంగా
ఉన్నవారిని మాముందు నిలుపుతూ అధ్భుతమే చేశావు. ఎన్ని కబుర్లు... ఎన్నెన్ని ఙ్ఞాపకాలు
ఎన్ని విషయాలు, ఎన్నెన్ని విశేషాలు, ఎన్నెన్ని సంగతులు, ఎన్నెన్ని సంతోషాలు, అయినవారి అనుబంధ
ఆత్మీయ సమాచారాలు, ఉభయుల కుశలాలు... మేము నేర్చిన కౌశలాలు గురించిన సమాచారాలు వావ్ .. అధ్భుతం నేస్తమా... మంచి కబురు మోసుకొస్తే మా మనసుకు మోదం, చెడు కబురు మోసుకొస్తే హృదయానికి ఖేదం, ఏమోయ్...అల్లుడు ఉత్తరం రాశాడు అమ్మాయి నెల తప్పిందంటా! అని చదువుతుంటే మధురానుభూతి, “పండుగకు కొత్త అల్లుడు వస్తున్నాడట!” అంటే మరొకవైపు ఆనందంతోకూడిన ఒత్తిడి. బాబాయ్ కి జాబు వచ్చిందని జాబు వస్తే సంబరం. అదే
బాబాయ్ డబ్బులు పంపండి అంటూ
లేఖ రాస్తే తాతకు వేదన, అమ్మమ్మ రోదన, అప్పు
కోసం నరకయాతన...వందల కిలోమీటర్ల దూరంలో
చదువుకుంటున్న హాస్టల్ లో ఉన్న విద్యార్ధులకు పోస్ట్ మాన్ మనియార్డర్ ద్వారా నగదు అందిస్తే అదోక అంతులేని అనుభూతి.. మాటల్లో వర్ణించలేని మధురానుభూతి, మా జీవితాలలో ప్రతి ఘట్టంలో జాబు ... సమస్యలను పరిష్కరించే జవాబు ... అన్నీ నీవే .... అంతటా నీవే... అలాంటి నీవు ఇప్పుడు ఇంచుమించు అదృశ్యం... అలా కాకపోయినా అరుదైన దృశ్యం... అమెరికాను పాలించిన గొప్ప అధ్యక్షుడు అబ్రహాం లింకన్ తన కొడుకును బడిలో చేర్చుతూ ఉపాధ్యాయునికి రాసిన సందేశాత్మక లేఖ... మన ప్రధమ ప్రధాని నెహ్రూగారు
చెరసాలలో ఉండగా, తన కూతురు ఇందిరకు సామాజిక అవగాహన కలిగిస్తూ రాసిన లేఖలు మొదలుకొని ఎన్నెన్నో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లేఖలను చదివిన, విన్న తరం మాది...
అదే లేఖ...
నేడు పదవ తరగతి చదివే విద్యార్ధులకు కూడా అన్ని సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులు నేర్పినా రాయలేని లేఖ, మార్కుల కోసమే తప్ప మనసు పెట్టి రాయలేని *మా*నవ*జాతి క్షోభ వర్ణించలేము... నేటితరం పడే పాట్లు, వారి
అగచాట్లు...భాష
రాక ...భావం లేక... పదాలు దొరకక.. వ్యాకరణం వెతకలేక... నిన్ను అందవిహీనం చేస్తున్నారు... ఎన్నో కాలాలకు మరెన్నో
తరాలకు ఊపిరులూదిన *ఉత్తరాకాండ* లాంటి నీకు
ప్రస్తుతం
బ్రతుకే అతీగతిలేని *అరణ్యకాండ* లా మారింది...! మా చెంతకు సెల్లు వచ్చాక... ఎన్నో సొల్లుమాటలు...మనసును ఉప్పొంగించే మధురభావాలకు గానీ, ఎదుటివారి కుశల ప్రశ్నలకు లేదు చోటు...ఉత్తర ప్రత్యుత్తరాలన్నింటా యాంత్రికత ప్రవేశం... దూరమైపోయిందోయ్ ఆత్మీయానుభూతుల సమ్మేళనం... అన్నిటికీ చరవాణి అదే ప్రస్తుతం మా పాలిట యువరాణి... కాలంతో మేం పరుగెడుతున్నాం అందరం, ఆత్మీయానుబంధాలను మరచిపోతున్నాము మేమందరం... క్షమించు నేస్తమా..! అని అడుగుదామా అందరం....ఇకనైన మనసు విప్పి మాటాడుకొనే ఉత్తరాలను చక్కగా రాసుకుందామా మనమందరం...
ఎర్రని రంగులలో యువరాణిలా ఆకర్షించే తపాలా డబ్బా, ఇప్పుడెక్కడ తుప్పుపట్టి, ఎంతదూరముందో వెతికి పట్టుకుందామా? అందుబాటులో ఉందిగా చరవాణి అని, ఇంకెందుకు ఆ తపాలా అని, ఆ పాత మధురాలను మరచిపోదామా? గుండెలకు హత్తుకొనేలా మనసు పొరలలో, హృదయాంతర దొంతరలలో దాచిపెట్టబడిన తీపి గురుతులను గురుతు చేసుకుందామా? మరచిపోతున్న మధుర ఙ్ఞాపకాలను గురుతు చేసిన నేస్తమా...
ఇక సెలవు.
ఇట్లు,
సదా నీ సేవలో,
చల్లగాని కృపాబాలానందం.
Comments
Post a Comment