75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా...
75వ
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో…
ఈరోజు జనవరి 26న మనం 75వ భారతదేశ
గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. రిపబ్లిక్ డే వేడకులకు మన దేశమంతటా
ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాలయాలు అంగరంగవైభవంగా మువ్వన్నెల
జెండాలతో ముస్తాబయ్యాయి. మువ్వన్నెల
పతాక రెపరెపలతో, మిఠాయిల పంపకాలతో
బాలల చిరునవ్వులతో దేశమంతటా గణతంత్ర దినోత్సవ సంబరాలు
అంబరాన్నంటుతున్నాయి. ఇంతటి విశిష్టమైన గణతంత్ర దినోత్సవం
గురించి తెలుసుకునేముందు మన స్వాతంత్ర్య మరియు గణతంత్ర దినోత్సవ చారిత్రక నేపథ్యం ఒకసారి గుర్తుచేసుకుందాం...
వ్యాపారం కోసం మన దేశానికి వచ్చిన బ్రిటీషువారు నాటి మనదేశ
పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకుని, దేశంలోని రాజుల మధ్య అనైక్యతను ఆసరగా
చేసుకుని క్రమంగా పట్టుసాధించారు. అనేక రాజ్యాలు, సంస్థానాలుగా ఉన్న భారతావనిని, విభజించు పాలించు విధానం అవలంభించి,
అధికారం హస్తగతం చేసుకున్నారు. దాదాపు 2 శతాబ్దాలకుపైగా బ్రిటీష్ వారి పాలనలో ఉన్న భరతమాతకు సుదీర్ఘ పోరాటం తర్వాత 1947 ఆగస్టు 15న
విముక్తి లభించింది అని మనందరికీ తెలుసు.
అసలు రిపబ్లిక్‌డేను జనవరి 26నే ఎందుకు
జరుపుకోవాలి?
అనే ప్రశ్నకు సరైన సమాధానం చాలా మందికి తెలియదు.
దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం లభించింది. స్వాతంత్య్రం
వచ్చిన తర్వాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శినికులు, మేధావులు
బ్రిటీషువారి అనుమతి మేరకు 1946 జూలై లో రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటుచేసుకున్నారు.
దీనికి అధ్యక్షుడిగా డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్‌ను ఎన్నుకోగా, రాజ్యాంగ రచనా
ముసాయిదా కమిటీ ఛైర్మన్‌గా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ను నియమించారు. భారత
రాజ్యాంగానికి 1935 భారత ప్రభుత్వ చట్టం మూలాధారం అయినప్పటికీ, అందులోని అనేక
అంశాలను ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించారు. బ్రిటీష్ పరిపాలన నుంచి విముక్తి పొందిన
తరువాత భారత పౌరులందరిని ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి, స్వాతంత్ర్య
పోరాట ఆశయాలను నెరవేర్చడానికి, రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి, ప్రపంచంలోనే
అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించారు. అనేక సవరణల అనంతరం, 1949
నవంబర్ 26న దీనిని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. భారత రాజ్యాంగాన్ని
రూపొందించేందుకు రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలం పట్టింది. రాజ్యాంగ
రచనకు మొత్తం రూ. 64 లక్షలు ఖర్చయ్యింది.
దీనిని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో రెండు
నెలలు వేచి ఉన్నారు. లాహోర్ వేదికగా 1930 జనవరి 26న కాంగ్రెస్ పార్టీ జాతీయ
సమావేశంలో తొలిసారిగా పూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. నెహ్రూ సారథ్యంలో రావీ నది
ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగురవేసి భారతీయుల స్వాతంత్ర సంకల్పాన్ని బ్రిటిషర్లకు
గట్టిగా వినిపించారు. జలియన్‌వాలాబాగ్
ఉదంతం ఆ తరువాత పరిణామాలు పూర్ణ స్వరాజ్య తీర్మానానికి నాందిపలికాయి. నాడు సుభాష్
చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో వేడి పుట్టించి
పూర్ణ స్వరాజ్య తీర్మానం ప్రకటన చేయించడంలో సఫలమయ్యారు. ఆ రోజునే స్వాతంత్య్ర
దినోత్సవంగా పరిగణించాల్సిందని భారత జాతీయ కాంగ్రెస్
పార్టీ కూడా దేశ ప్రజలకు పిలుపు ఇచ్చింది. అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి
చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు రాజ్యాంగ రచన 1949లో
పూర్తయినా.. మరో రెండు నెలలు ఆగి 1950 జనవరి 26 నుంచి దానిని అమల్లోకి తెచ్చారు.
అయితే మన దేశాన్ని
గణతంత్ర దేశం అని పిలవడానికి
కారణం ఎన్నిక కాబడిన దేశ అధ్యక్షుడు ఉండటం అని చెప్పవచ్చును. జనవరి 26, 1950 నుంచి బ్రిటీష్ కాలంనాటి భారత
ప్రభుత్వ చట్టం -1935 రద్దయ్యింది. ఆ రోజున భారత్ సర్వసత్తాక, ప్రజాస్వామ్య,
గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ఆ రోజున భారత
ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, లౌకికతత్వం, న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక
హక్కుగా పొందడం జరిగింది.
ఇక, తొలి గణతంత్ర దినోత్సవం నాటికి డాక్టర్
రాజేంద్ర ప్రసాద్ భారత రాష్ట్రపతిగా ఎన్నుకోబడినారు. రాజ్యాంగం అమలైన
తర్వాత ఆయన ప్రస్తుత పార్లమెంట్ దర్బార్ హాల్‌లో రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు. ఐదు
మైళ్ల పొడవున సాగిన పరేడ్ తర్వాత, ఆయన ఇర్విన్ స్టేడియంలో జాతీయ జెండాను
ఎగురవేశారు. వీదేశీ పాలన పూర్తిగా అంతరించి, అధికారాన్ని అప్పగించిన గురుతులే
రిపబ్లిక్ డే! స్వతంత్ర దేశంగా పురుడుపోసుకుని ప్రపంచ దేశాల కూటమిలో సంపూర్ణ
స్వతంత్ర దేశంగా భారత్ చేరింది.
74 వసంతాలు
పూర్తి అయి నేడు 75 వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ఈ సమయంలో దేశ పరిస్థితులను
అభివృద్ధిని ఒకసారి పరిశీలిస్తే నాణానికి రెండువైపులా అన్న చందంగా కనిపిస్తుంది.
ఒకవైపు చూస్తే…
* మనదేశం నేటికీ ప్రజాస్వామ్య విధానాన్ని అమలుపరుస్తూ ప్రపంచదేశాలకు
ఆదర్శంగా నిలుస్తుంది. *ఒక వ్యక్తి ఒక ఓటు - ఒక ఓటు ఒక విలువ అనే రాజకీయ సమానత్వం ఆధారంగా
ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య ప్రభుత్వాల పాలనలో దేశం అనేకరంగాలలో పురోగతి సాధించింది.
* శాస్త్ర సాంకేతిక రంగాలలో చాలా అభివృద్ధి
సాధించాము.
*చంద్రయాన్ 3 విజయవంతంగా ప్రయోగించడం ద్వారా
ప్రపంచదేశాల ముందు సగర్వంగా తలెత్తకొని నిలబడింది
*ప్రపంచంలో అత్యధిక యువతతో ఉత్పత్తిలో
ముందువరుసలో ఉంది.
*దేశంలో సగభాగమైన స్త్రీలు విద్యా, ఉద్యోగ,
రాజకీయ ఆర్ధిక వాణిజ్య రంగాలలో ముందుండి స్వంయం సాధికారతవైపు అడుగులు
వేస్తున్నారు
*ప్రపంచంలోని అత్యధిక విద్యావంతులు గల దేశంగా
నిలిచింది.
*దేశసంపద, ఆహారోత్పత్తి, వస్తూత్పత్తి
వందలరెట్లు పెరిగింది.
*విద్య, వైద్యరంగాలు, రవాణా, సమాచార - ప్రసార సాధనాలు వేగంగా అభివృద్ది చెందాయి.
• పట్టణీకరణ వేగవంతంగా జరుగుతుంది.
మరోవైపు
చూస్తే ...
* రాజకీయాలు
కులము, మతం, ప్రాంతీయతత్వం పెరిగి డబ్బుతో శాసించే పరిస్థితి
రావడంతో విలువలు తగ్గి, నిజాయితీ
గల వ్యక్తులు మరియు ఆర్ధికంగా
వెనుకబడిన వ్యక్తులు రాజకీయాలలోకి
అడుగిడే పరిస్థితి లేకుండా పోయింది
* జనాభాలో ప్రపంచంలో అత్యధిక జనాభా గల
దేశంగా అవతరించింది తద్వారా అనేక సమస్యలకు
నిలయమైంది
*సమారు యాభై శాతం పైగా పేదరికంతో
ప్రపంచ పేదలలో సగభాగం గల దేశంగా అవతరించింది.
*ఇప్పటికీ ముప్పై కోట్ల మంది
నిరక్షరాస్యులు గానే ఉన్నారు.
* విద్య ప్రైవేటీకరణ
జరిగి చదువులు కొనుక్కొనే స్థితి రావడం విద్యార్థులలో దేశభక్తి తగ్గి వలన మేధో వలస జరుగుతుంది.
* విద్యావంతులు, నైపుణ్యాలు గలవారు ఆర్ధిక సంపాదనే లక్ష్యం తో ఇతర రంగాల వైపు దృష్టి సారించడం
భోదనారంగానికి దూరం కావడం కారణంగా విద్యా ప్రమాణాలు
రోజురోజుకు పతనమౌతున్నాయి.
*పేదరికం, నిరుద్యోగం, అల్ప ఉద్యోగిత,
నిరక్షరాస్యత సమస్యలు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి.
• ఆదాయ అసమానతలు పెరిగి సహజవనరులు మరియు జాతీయ సంపద కొద్దిమంది చేతిలో కేంద్రీకృతమై పోయింది.
• సమసమాజ స్థాపన అంతిమ లక్ష్యంగా రాజ్యాంగం లో పొందుపరిచిన సామ్యవాద భావనలకు కాలం చెల్లింది.
• సహజ వనరుల దోపిడీ, వాయు, నీటి, ఆహార, శబ్ధ కాలుష్యం, ఇష్టానుసారంగా అడవులు నరకడం, గనుల త్రవ్వకం పెరిగి
పర్యావరణ కాలుష్యం పెరిగిపోయింది.
• అత్యధిక యువత సరియైన నైపుణ్యాలు లేక
సరియైన విద్య అందక సరియైన ఉపాది, ఉద్యోగాలు లభించక చెడు అలవాట్లకు, మధ్యం, గంజాయి, డ్రగ్స్ లాంటి వ్యసనాలకు బానిసలుగా మారి వ్యక్తిగతంగా బలహీనులుగా మారి సమాజ శ్రేయస్సుకు ఆటంకంగా మారిపోతున్నారు.
ఒకప్పుడు భారతీయులందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి దేశ స్వాతంత్రం కోసం
ఎన్నో త్యాగాలు చేసి తమ ప్రాణాలనే తృణప్రాయంగా భావించి, స్వరాజ్య యజ్ఞంలో సమిధలైన
గొప్ప వ్యక్తులను ఈ రోజు ఎంత మంది స్మరిస్తున్నారు? జాతీయ సెలవు రోజున ఎంత మంది
వారి ఆదర్శాలను వల్లించుకుంటున్నారు? దేశ స్వాతంత్రం మీద నేటి యువతకి ఎంత అవగాహన
ఉంది? భావి భారతాన్ని అభివృద్ధి పధంలో నడిపించాల్సిన యువత నైతిక విలువలు, విద్య,
నైపుణ్యాలు పెంపొందించుకోకపోతే ఈ దేశ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. దేశ
భవిష్యత్తు తరగతిగదిలోనే నిర్మించబడుతుంది అన్న కొఠారీ కమీషన్ నివేదిక ప్రకారం
ఉపాధ్యాయులు విద్యార్ధులు, తల్లిదండ్రులు, సమాజం కలిసి కట్టుగా స్వార్ధాన్ని వీడి,
పట్టుదలతో ప్రయత్నం చేస్తేనే అభివృద్ది చెందిన భారతాన్ని అసమానతలు లేని సమాజాన్ని
రూపొందించుకోగలం. "సొంతమేలు కొంత
మానుకొని పొరుగువారికి తోడ్పడవోయ్" అని నిస్వార్ధంగా భావించినపుడు. నా దేశం నాకే మిచ్చింది
అనే భావన మానుకొని నా దేశానికి
నేను ఏమివ్వగలను అని ప్రజలందరూ
భావించినపుడు మాత్రమే…
"దేశం మనదే తేజం మనదే.. దేశం మనదే తేజం మనదే..
ఎగురుతున్న జెండా మనదే.. నీతి మనదే జాతి మనదే..
ప్రజల అండదండా మనదే.. అందాల బంధం ఉంది ఈ నేలలో..
ఆత్మీయరాగం ఉంది ఈ గాలిలో.. ఏ కులమైనా ఏ మతమైనా..
ఏ కులమైనా ఏ మతమైనా.. భరతమాతకొకటేలేరా..
ఎన్ని బేధాలున్నా మాకెన్ని
తేడాలున్నా.. దేశమంటే ఏకమవుతాం అంతా ఈవేళా..
వందేమాతరం అందామందరం.. వందేమాతరం ఓ… అందామందరం.."
అని పాడుకుంటూ, ఆచరించినపుడు మాత్రమే
భారత దేశ త్రివర్ణపతాకం ప్రపంచదేశాల ముందు సగౌరవంగా రెపరెపలాడుతుంది.
చల్లగాని కృపాబాలానందం,
సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులు
Comments
Post a Comment